ఓట్ల తొలగింపు వల్లే ప్రతిపక్షాల ఓటమి..వెస్ట్ బెంగాల్‌‌‌‌ లో 31 లక్షల ఓట్లు గల్లంతు : అసదుద్దీన్ ఒవైసీ

ఓట్ల తొలగింపు వల్లే ప్రతిపక్షాల ఓటమి..వెస్ట్ బెంగాల్‌‌‌‌ లో 31 లక్షల ఓట్లు గల్లంతు : అసదుద్దీన్ ఒవైసీ

 

  • భారీగా ముస్లిం ఓట్లను తీసేశారు : అసదుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్, వెలుగు: ఓట్ల తొలగింపు వల్లే ప్రతిపక్షాలు ఓటమి పాలయ్యాయని మజ్లిస్​ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. వెస్ట్​ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌‌‌‌లో దాదాపు 31 లక్షల ముస్లింల ఓట్లను తొలగించారని, ఇది మమతా బెనర్జీ ఓటమిపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు.

భవానీపూర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారని, తమిళనాడులోనూ ఇదే వ్యూహం అమలు చేశారని ఆరోపించారు. సీఎం స్టాలిన్ కొళత్తూరులో ఓటమికి ఓటర్ల గల్లంతు ఒక కారణమన్నారు. ‘సర్’పై ప్రతిపక్షాలు సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయని పేర్కొన్నారు.

ముస్లింలకు స్వతంత్ర రాజకీయ నాయకత్వం అవసరం

దేశవ్యాప్తంగా ముస్లింలకు స్వతంత్ర రాజకీయ నాయకత్వం అవసరమని ఒవైసీ అన్నారు. సోకాల్డ్​ సెక్యూలర్​ పార్టీలు బీజేపీని అడ్డుకోలేకపోతున్నాయని పేర్కొన్నారు. ముస్లింలు కేవలం ఓటర్లుగా కాకుండా నిర్ణయాధికారులుగా ఎదగాలని, స్వతంత్ర నాయకత్వాన్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. వెస్ట్ బెంగాల్‌‌‌‌లో మజ్లిస్​ పార్టీకి గణనీయమైన ఓట్లు వచ్చినప్పటికీ సీట్లు సాధించలేకపోయినట్టు చెప్పారు.

కాండీ వంటి ప్రాంతాల్లో అభ్యర్థులు మంచి ప్రదర్శన ఇచ్చారన్నారు. భవిష్యత్తులో మాల్దా, ముర్షిదాబాద్ జిల్లాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. అసోంలో ముస్లింలకు మరింత బలమైన ప్రాతినిధ్యం అవసరమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని, హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు నిధులివ్వాలని అసదుద్దీద్ డిమాండ్ చేశారు.